Nimmakaya Karam : మనం రకరకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే నిల్వ పచ్చళ్లలో నిమ్మకాయ పచ్చడి కూడా ఒకటి. నిమ్మకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. నిమ్మకాయలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. గొంతు నొప్పి, దగ్గును తగ్గించడంలోనూ నిమ్మకాయ ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో నిమ్మకాయలు ఎంతో ఉపయోగపడతాయి. నిమ్మకాయలతో పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ పచ్చడి తయారవడానికి సమయం ఎక్కువగా పడుతుంది. సమయం లేని వారు అప్పటికప్పుడు నిమ్మకాయ కారాన్ని చేసుకుని తినవచ్చు. ఇది కూడా నిమ్మకాయ పచ్చడిలాగే రుచిగా ఉంటుంది. నిమ్మకాయ కారాన్ని మనం చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మరసం – 2 లేదా 3 టీ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నువ్వుల పొడి – ఒక టీ స్పూన్, మెంతుల పొడి – చిటికెడు, జీలకర్ర పొడి – చిటికెడు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – అర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 8.
నిమ్మకాయ కారం తయారీ విధానం..
ఒక గిన్నెలో నిమ్మకాయ రసాన్ని తీసుకుని కారం, రుచికి తగినంత ఉప్పును, ధనియాల పొడిని, నువ్వుల పొడిని, జీలకర్ర పొడిని, మెంతుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా అన్నీ వేసి కలిపి పెట్టుకున్న నిమ్మరసం మిశ్రమంలో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ కారం తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయ పచ్చడిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. సమయం లేని వారు ఈ విధంగా అప్పటికప్పుడు నిమ్మకాయ కారాన్ని చేసుకుని తినడం వల్ల నిమ్మకాయ పచ్చడిని తిన్న అనుభూతిని పొందవచ్చు.