Vakkayalu : మనకు కొండ ప్రాంతాలలో మాత్రమే కనిపించే కొన్ని రకాల చెట్లల్లో కలెక్కాయల చెట్టు కూడా ఒకటి. దీనిని వాక్కాయల, కరెండకాయల చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్లు చిట్టడువులలో, కొండ ప్రాంతాలలో సహజ సిద్దంగా పెరుగుతాయి. ఈ కాయలు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. కనుక వీటిని పచ్చళ్ల తయారీలో, పులిహోర తయారీలో కూడా ఉపయోగిస్తారు. వాక్కాయ పండ్లు కేవలం వానాకాలంలో మాత్రమే లభిస్తాయి. వీటిని కూరగాయలుగా, సుగంధ ద్రవ్యాలుగా కూడా ఉపయోగిస్తారు. వాక్కాయ పండ్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మూత్ర నాళాలను శుభ్రపరిచి మూత్రం సాఫీగా వచ్చేలా చేయడంలో ఈ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ చెట్లను కొందరు రైతులు పంటగా కూడా సాగు చేస్తున్నారు. ఇవి నేల నుండి 5 లేదా 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వాక్కాయ చెట్లు పెరగడానికి నీటి అవసరం అంతంగా ఉండదు. ఎంతటి కరువు పరిస్థితిని అయినా ఇవి ఎదుర్కొని పెరుగుతాయి. ఈ చెట్లు ముళ్లను కలిగి ఉంటాయి. కనుక వీటిని పంట పొలాలకు కంచెలుగా కూడా పెంచుకుంటారు. ఈ పండ్లలో ఉండే గింజలను నాటడం వల్ల కొత్త మొక్కలు వస్తాయి. ఈ పండ్లు చూడడానికి కాన్ బెర్రీస్ లా ఉంటాయి. కనుక వీటిని ఇండియన్ కాన్ బెర్రీస్ అని కూడా అంటారు. ఇవి పరిమాణంలో ద్రాక్ష పండ్ల లాగా ఉంటాయి.
వాక్కాయలు గుత్తులు గుత్తులు గా కాస్తాయి. వాక్కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకు పచ్చ రంగులో.. పండే కొద్దీ ముదురు ఎరుపు రంగులో, పూర్తిగా పండిన తరువాత నలుపు రంగులో ఉంటాయి. ఈ కాయలను చెట్టు నుండి కోసినప్పుడు వాటి నుండి పాలు కారుతాయి. పండ్లకు గనక పాలు అంటుకుంటే వాటిని కడిగిన తరువాతే పండ్లను తినాలి. వాక్కాయలు పచ్చిగా ఉన్నప్పడు వగరుగా తినడానికి వీలు లేకుండా ఉంటాయి. పండే కొద్దీ వగరు రుచిని, పూర్తిగా పండిన తరువాత తీపి రుచిని కలిగి తినడానికి వీలుగా ఉంటాయి.ఈ పండ్లను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటారు. వాక్కాయలను తినడం వల్ల మధుమేహం తగ్గుతుంది. జామ్, జెల్లి వంటి వాటి తయారీలో కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేయడంతోపాటు గుండెను, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాక్కాయ పండ్ల రసాన్ని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.