Ants : సాధారణంగా అందరు ఇళ్లలోనూ చీమలు కనిపిస్తుంటాయి. ఇవి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ తిరుగుతుంటాయి. ఇవి మనం తినే ఆహార పదార్థాలను తింటూ నాశనం చేస్తాయి. దీంతో చీమల బెడదను తట్టుకోలేకపోతుంటారు. ముఖ్యంగా తీపి పదార్థాల వంటివి నేలపై పడినప్పుడు చీమలు బాగా వస్తాయి. ఇది మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ చీమలను మనం చాలా సులభంగా పారిపోయేలా చేయవచ్చు.
చీమలు ఉన్న చోట దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి ఆ నీటిని స్ప్రే చేయడం వల్ల చీమలు పోతాయి. అలాగే నిమ్మరసంలో ఉప్పు కానీ వైట్ వెనిగర్ ను కానీ కలిపి చీమలు ఉన్న చోట స్ప్రే చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వేడి నీటిలో ఉప్పును కలిపి ఆ నీటిలో వస్త్రాన్ని ముంచి చీమలు ఉన్న చోట రాయడం వల్ల చీమలు పారిపోతాయి.
అదేవిధంగా పుదీనా ఆకుల పొడిని నీటిలో కలిపి చీమలు ఉన్న చోట స్ప్రే చేయడం వల్ల చీమలు పట్టకుండా ఉంటాయి. వైట్ వెనిగర్ ను నీటిలో కలిపి చీమలు ఉన్న చోట చల్లడం వల్ల కూడా చీమల బెడద తగ్గుతుంది. కాఫీ పొడిని లేదా మిరియాల పొడిని నీటిలో కలిపి చల్లినా కూడా చీమలు పోతాయి. ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్న చోట నిమ్మ చెక్కలను, వెల్లుల్లి రెబ్బలను ఉంచినా కూడా చీమలు పారిపోతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చీమల బెడద తగ్గుతుంది. మార్కెట్‌లో మనకు లభించే చీమల మందులను వాడడం కన్నా ఇలా సహజసిద్ధంగా పదార్థాలను వాడి వాటి నుంచి విముక్తి పొందవచ్చు.