గతేడాది ఇదే సమయంలో కరోనా లాక్‌డౌన్ విధించారు. ఆ సమయంలో కేసుల సంఖ్య పెద్దగా లేదు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించాక ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. లక్షల మంది చనిపోయారు. తరువాత గతేడాది అక్టోబర్ సమయంలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో కరోనా ప్రభావం పోయిందని భావించారు. కానీ ప్రస్తుతం సెకండ్ వేవ్ రూపంలో కరోనా మళ్లీ భయపెడుతోంది. గత ఏడాది కన్నా వేగంగా కోవిడ్ వ్యాపిస్తోంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం అయింది. అందుకు గాను కింద తెలిపిన 6 మార్గాలు ఉపయోగపడతాయి.
1. యాంటీ ఆక్సిడెంట్లు.. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దానిమ్మ, జామ, నిమ్మ, బెర్రీలు, బాదంపప్పు, అవకాడోలు, ఇతర నట్స్, విత్తనాలు, క్యారెట్లు, చిలగడ దుంపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. పసుపు, అల్లం, నల్ల మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, యాలకులు, తులసి, తిప్పతీగ వంటి మసాలాలు, పోపు దినుసులు, మూలికలను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
3. నిద్ర సరిగ్గా పోకపోతే రోగ నిరోధక శక్తిపై అది ప్రభావాన్ని చూపిస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కనుక రోగ నిరోధక శక్తి పెరగాలంటే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా సరే నిద్రించాలి. ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనేది వారి శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. కనుక ఎవరి సౌకర్యానికి తగినట్లుగా వారు తగినన్ని గంటల పాటు రోజూ నిద్రించాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, బీన్స్, చిక్కుడు జాతి కూరగాయలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
5. వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. ఆహారం జీర్ణం కాని పక్షంలో ఆ పూటకు కూరగాయల సూప్, కొబ్బరి నీళ్లు, కీరదోస ముక్కలను తీసుకోవాలి. తరువాత పూటకు ఆకలి వేస్తే తినాలి. ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే రాత్రి 10 గంటల తరువాత ఎట్టి పరిస్థితిలోనూ ఆహారాన్ని తీసుకోకూడదు. దీని వల్ల కాలేయంపై అదనపు భారం పడుతుంది. అలాగే రాత్రి భోజనం, నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి అయినా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయ పడుతుంది.
6. రోజూ సూర్యరశ్మిలో కొంత సేపు గడపాలి. దీని వల్ల విటమిన్ డి తయారవుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది. రోజూ కొంత సేపు ప్రకృతిలో సహజసిద్ధమైన గాలిలో తిరగాలి. దీని వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి. సూక్ష్మ క్రిములపై పోరాడగలిగే శక్తి ఊపిరితిత్తులకు లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365