Instant Ragi Dosa : చిరు ధాన్యాలైన రాగులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని మనందరికి తెలుసు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, షుగర్ ను నియంత్రించడంలో రాగులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. రాగులను పిండిగా చేసి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోదగిన వంటకాల్లో రాగి దోశ కూడా ఒకటి. రాగిదోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సలుభం. రాగిపిండితో ఇన్ స్టాంట్ గా దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక టీ గ్లాస్, గోధుమ పిండి – పావు గ్లాస్, బియ్యం పిండి – ఒక టీ గ్లాస్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – నాలుగున్నర టీ గ్లాసులు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఇన్ స్టాంట్ రాగి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాల్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూడున్నర గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత ఉంచి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత మరో గ్లాస్ నీటిని పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక గంటెతో పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. ఈ రాగి దోశలు సాధారణ దోశలుగా ఉండవు. ఇవి రవ్వ దోశల్లాగా ఉంటాయి. దోశ కొద్దిగా కాలిన తరువాత దానిపై నూనె వేసి కాల్చుకోవాలి. దోశ కాలిన తరువాత దానిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండే రాగి దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా రాగి దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.