Masala Tea : మన శరీరబడలికను తగ్గించడంలో, మానసిక ఉత్సాహాన్ని పెంచడంలో టీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే టీ తాగే వారు అలాగే రోజుకు 4 నుండి 5 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు. మానసిక ఆందోళన, ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నప్పుడు టీ తాగితే ఒత్తిడి వెంటనే దూరమవుతుంది. అలాగే మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ టీని తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. అందులో భాగంగా చక్కటి వాసనను, రుచిని కలిగి ఉండే మసాలా టీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – అర టీ స్పూన్, యాలకులు – అర టీ స్పూన్, లవంగాలు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2 ( చిన్నవి), శొంఠి – ఒక టీ స్పూన్, నీళ్లు – 2 టీ గ్లాసులు, టీ పౌడర్ – 2 టీ స్పూన్స్, పాలు – 2 టీ గ్లాసులు, పంచదార – ఒకటిన్నర టీ స్పూన్ లేదా తగినంత.
మసాలా టీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా దినుసులు, కచ్చా పచ్చాగా దంచుకున్న శొంఠిని వేసి పచ్చి వాసన పోయేలా దోరగా వేయించుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే టీ పౌడర్ వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత అర టీ స్పూన్ మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి మరిగించాలి. నీళ్లు చక్కగా మరిగిన తరువాత పాలు, పంచదార వేసి మరిగించాలి. టీ మరిగి చక్కటి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకుని కప్పులోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చక్కటి వాసనను, రుచిని కలిగి ఉండే మసాలా టీ తయారవుతుంది. ఈ టీ లో సోంపు గింజలను, తులసి గింజలను కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలా టీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ విధంగా మసాలా టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీర బడలిక తగ్గడంతో పాటు మానసిక ఆనందం కూడా కలుగుతుంది.