మన శరీరానికి రక్తం ఇంధనం లాంటిది. అది మనం తినే ఆహారాల్లోని పోషకాలతోపాటు ఆక్సిజన్‌ను శరీరంలోని అవయవాలకు, కణాలకు మోసుకెళ్తుంది. దీంతో ఆయా అవయవాలు, కణాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే కొందరికి రక్తనాళాల్లో రక్తం గడ్డు కడుతుంటుంది. దీంతో శరీర భాగాలకు పోషకాలు సరిగ్గా అందవు. ఏదైనా గాయం అయినప్పుడు సహజంగానే ఎర్ర రక్త కణాలు పేరుకుపోయి రక్తం గడ్డ కడుతుంది. దీంతో అధిక స్రావం కాదు. ఇది మంచిదే. కానీ కొందరికి బ్లడ్ క్లాట్స్ అనేవి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. శరీరంలో ఎక్కడైనా సరే రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. ఎర్ర రక్త కణాలు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ క్రమంలోనే దాన్ని పట్టించుకోకపోతే డీప్ వీన్ త్రాంబోసిస్ (డీవీటీ) అనే వ్యాధికి దారి తీస్తుంది.
అయితే శరీరంలో రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఎక్కడైనా ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు మన శరీరం మనకు కొన్ని సూచనలు, లక్షణాలను తెలియజేస్తుంది. అవేమిటంటే..
1. రక్త నాళాల్లో రక్తం గడ్డ కడితే ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. ఛాతిలో భారంగా ఉండడం, నొప్పిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెమట ఎక్కువగా పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఛాతి భాగంలో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది.
2. ఊపిరితిత్తుల్లో సూదితో గుచ్చినట్లు నొప్పి వస్తుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దగ్గు ఎక్కువగా వస్తుంది. ఒక్కోసారి రక్తం కూడా పడుతుంది.
3. కాళ్లు, చేతులలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. వాపులు కనిపిస్తాయి. ఆయా భాగాలు పట్టేసినట్లు అనిపిస్తాయి. వేడిగా ఉంటాయి.
4. పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. విరేచనాలు, వాంతులు అవుతాయి.
5. తమ చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడలేకపోతుంటారు. మాట తడబడుతుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పైన తెలిపిన లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వాటిని బ్లడ్ కాట్స్ గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయినంత మేర మందులను వాడుకోవాలి. అలాగే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల బ్లడ్ క్లాట్స్ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
1. బ్లడ్ క్లాట్స్‌ను తగ్గించేందుకు పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ క్లాట్స్ ఏర్పడకుండా చూస్తుంది. పసుపును తీసుకోవడం వల్ల క్లాట్స్ వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి. పసుపులో యాంటీ త్రాంబోటిక్, యాంటీ కోఆగులంట్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడవు. రోజూ పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది.
2. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలను బ్లడ్ క్లాట్స్‌ను కరిగిస్తాయి. ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి రెబ్బలు 2-3 తినడం వల్ల బ్లడ్ క్లాట్స్ తగ్గుతాయి. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రక్త నాళాలను ప్రశాంత పరుస్తాయి. దీంతో హైపీబీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తాన్ని పలుచగా చేయడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. దీంతో క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి.
3. పండు మిరపకాయల్లో రక్తాన్ని పలుచన చేసే లక్షణాలు ఉంటాయి. వీటిలో ఉండే సాలిసైలేట్స్ రక్తాన్ని గడ్డ కట్టకుండా చూస్తాయి. వీటిలో ఉండే కాప్సెయిసిన్ బ్లడ్ క్లాట్ అవకుండా చూస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. దీంతో క్లాట్స్ కరుగుతాయి.
4. అర్జున చెట్టు బెరడు రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయ పడుతుంది. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అర్జున చెట్టు బెరడును నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. దీంతో గుండె కండరాలు దృఢంగా మారుతాయి. గుండె పనితీరు మెరుగు పడుతుంది. బ్లడ్ క్లాట్స్ కరుగుతాయి.
5. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చూస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. రక్త నాళాలు గట్టి పడకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. రోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి.
రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి. కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం, డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, శరీరంలో అంతర్గతంగా గాయాలు కావడం, స్థూలకాయం, లివర్ జబ్బులు, పొగ తాగడం, రక్త హీనత వంటి సమస్యల వల్ల కూడా క్లాట్స్ ఏర్పడుతాయి. కనుక ఆయా సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేయాలి. దీని వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. కనుక క్లాట్స్ విషయంలో ముందుగానే జాగ్రత్త పడాల్సి ఉంటుంది.