Vankaya Pulusu : వంకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వంకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో మనం ఎక్కువగా పచ్చడి, వేపుడు, కూర వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. వంకాయలతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. కమ్మగా, తిన్నా కొద్ది తినాలనిపించేలా వంకాయలతో పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన వంకాయలు – పావు కిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, బెల్లం – ఒక చిన్న ముక్క, శనగపిండి – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నీళ్లు – ఒక గ్లాస్.
వంకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వంకాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి వంకాయలను సగానికి పైగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత పసుపు, కారం, బెల్లం, శనగపిండి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై అర గంట పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసు మూడు రోజుల వరకు తాజాగా ఉంటుంది. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పులుసును కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ వంకాయ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.