Chicken Kurma : చికెన్ కుర్మా.. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. చికెన్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చక్కటి రుచితో పాటు ఇందులో గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తయారు చేయడంకూడా చాలా సులభం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ చికెన్ కుర్మాను ఎలా తయారుచేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ముప్పావుకిలో, పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు -ఒక టేబుల్ స్పూన్, కారం – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర- కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు -ఒక రెమ్మ, నూనె- 4 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, యాలకులు – 3, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 2, సాజీరా – అర టీ స్పూన్, నల్ల యాలక్కాయ – 1, అనాస పువ్వు -1, జీడిపప్పు – 10.
చికెన్ కుర్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయ్యే వరకు వేయించాలి.తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత గసగసాల పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. ఈ చికెన్ ను మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పూరీ, రాగి సంగటి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.