Heat And Cool Foods : మనలో కొందరికి కాలంతో సంబంధం లేకుండా శరీరంలో వేడి చేస్తూ ఉంటుంది. కళ్లల్లో మంటలు, కాళ్లల్లో చురుకులు, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావడం, శరీరమంతా మంట పుట్టినట్టు ఉండడం, మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన మంట, పాదాల పగుళ్లు, అలాగే శరీరంలో సున్నితమైన భాగాల్లో చర్మం పగిలి మంట, దురద రావడం వంటి లక్షణాలు వేడి చేయడం వల్ల కనిపిస్తాయి. అలాగే ఎప్పుడు జ్వరం వచ్చినట్టుగా శరీరం కాలిపోతూ ఉండడం, జలుబు, దగ్గు, ఆయాసం ఉండడం, మలం మరియు మూత్రవిసర్జన సమయంలో మంట, గుండె దడ, కడుపులో ఎసిడిటీ పెరగడం, శరీరమంతా చిరు చెమటలు రావడం, దప్పిక , తల తిరగడం, బీపీ పెరగడం వంటివి కూడా వేడి వల్ల కనిపించే లక్షణాలే.
ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చిన్నగా కనిపించే ఈ సమస్యలే ముదరి మరింత పెద్దవిగా తయారవుతాయి. అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల జీవకణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే రక్తహీనత, రక్తనాళాలు దెబ్బతినడం వంటివి కూడా జరుగుతాయి. మూత్రపిండాలు, కాలేయం, జీర్ణాశయం వంటి అవయవాలు అతి వేడి వల్ల త్వరగా దెబ్బతింటాయి. కనుక వెంటనే శరీరాన్ని చల్లబరుచుకోవాలి. శరీరంలో వేడి చేసినట్టుగా అనిపించగానే చలువ చేసే పదార్థాలను తీసుకోవాలి.
అలాగే వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. శరీరంలో వేడి చేసినప్పుడు పులుపు, అల్లం వెల్లుల్లి, మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు, నిల్వ పచ్చళ్లు వంటి వాటిని తీసుకోకూడదు. కాఫీ, టీ లను తీసుకోకూడదు. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఉప్పు, కారం వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. చింతపండు వాడకుండా చేసే పప్పు చారును తీసుకోవాలి. పెసరకట్టు, కందికట్టు వంటి వాటిని తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, ఖర్జూజ, కీరదోస, దానిమ్మ, కమలా వంటిపండ్లను తీసుకోవాలి. మజ్జిగను ఎక్కువగా తాగాలి. తీపి, వగరు రుచులు ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
ఆపిల్, క్యారెట్, పుచ్చకాయ.. ఈ పండ్లను కలిపి జ్యూస్ గా చేసుకుని రోజూ ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర, శొంఠిని సమానంగా తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తీసుకోవాలి. అలాగే పులుపు లేని పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం పూట అల్పాహారాలకు బదులుగా మజ్జిగ అన్నం వంటి వాటిని తీసుకోవాలి. అలాగే సబ్జా గింజలను నీటిలో నానబెట్టి గింజలతో సహా ఆ నీటిని తాగాలి. ఇటువంటి చలువ చేసే పదార్థాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.