Panasa Thonalu : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పనస తొనలు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా పండగలకు తయారు చేస్తూ ఉంటారు. పనస తొనలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే పనస తొనలను తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే పనస తొనలను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనస తొనల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, బటర్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పంచదార – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు.
పనస తొనల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత బటర్ ను కరిగించి వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. పిండి నానిన తరువాత ఈ పిండి ముద్దను రోల్ లాగా చేసుకోవాలి. తరువాత కత్తితో సమానంగా చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఈ చపాతీ అంచులను వదిలేసి మధ్యలో కత్తితో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ అంచులను గుండ్రంగా చుట్టుకోవాలి.
ఇలా పనస తొనల్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పనస తొనలను వేసి మధ్యస్థ మంటపై క్రిస్పీగా, ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి తీగపాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పనస తొనలను వేసి పది నిమిషాల పాటు అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. పనస తొనలకు పాకం పట్టిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనస తొనలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే పనస తొనలను తయారు చేసుకుని తినవచ్చు.