Pachi Mirapakaya Nilva Pachadi : పచ్చిమిర్చిని మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాము. పచ్చిమిర్చి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనం చేసే వంటలకు చక్కటి రుచిని తీసుకురావడంలో ఇది మనకు ఎంతగానో సహాయపడతాయి. చట్నీలు, కూరలల్లో వాడడంతో పాటు పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. పాతకాలంలో ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసేవారు. అన్నం, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చిమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – పావుకిలో, చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4.
పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి కలపాలి. వీటిని మరికొద్ది సేపు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ముందుగా జార్ లో చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చడి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని పెరుగు అన్నం, వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది.