Moong Dal Pakoda : మనం పెసరపప్పుతో కూరలు, పప్పు, సాంబార్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ వంటకాలే కాకుండా పెసరపప్పుతో చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసే చిరుతిళ్లల్లో పెసరపప్పు పకోడా కూడా ఒకటి. అల్పాహారంగా మరియు స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పకోడాలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి అందరికి నచ్చుతాయని కూడా చెప్పవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ మూంగ్ దాల్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మూంగ్ దాల్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – 250గ్రా., జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 3, అల్లం – అర అంగుళం ముక్క, వెల్లుల్లి రెమ్మలు – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మూంగ్ దాల్ పకోడా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును మరోసారి కడిగి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండిని సిద్దం చేసుకున్న తరువాత ఇందులో ఉప్పు, పసుపు, వంటసోడా, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక పిండిని తీసుకుని పునుగుల్లాగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మూంగ్ దాల్ పకోడా తయారవుతుంది. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో తింటే మరింత రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన మూంగ్ దాల్ పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.