Cough And Cold : మండే ఎండల నుంచి మనకు వర్షాలు ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. వాతావరణాన్ని చల్లగా మారుస్తాయి. దీంతో మనం వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతాం. కానీ వాతావరణం మారడం వల్ల మనకు రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం అనేక రోగాలను తెచ్చి పెడుతుంది. ఈ సీజన్‌లో జాగ్రత్తగా ఉండకపోతే వ్యాధుల బారిన పడి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో తినే తిండి, తాగే నీళ్లతోపాటు మన ఇల్లు, ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
ముఖ్యంగా ఈ సీజన్‌లో దోమల నుంచి రక్షణ పొందాలి. ఇన్ని జాగ్రత్తలు పాటించినా కూడా మనల్ని దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు ఇబ్బందులకు గురి చేస్తాయి. అయితే ఇవి రాగానే చాలా మంది మెడికల్ షాపులకు వెళ్లి మందులను తెచ్చి వేసుకుంటారు. కానీ దీర్ఘకాలంగా వీటిని వాడితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కనుక సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి సీజనల్ వ్యాధుల నుంచి బయట పడాల్సి ఉంటుంది. అందుకు గాను కింద చెప్పిన చిట్కాలను పాటించాలి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మిరియాలతో..
దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని అందించడంలో మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి. మిరియాల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో తేనె కలపాలి. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటి మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తింటే దగ్గు, జలుబు నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. దీంతో జ్వరం కూడా తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అల్లం, తేనె మిశ్రమం..
అల్లం, తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకుంటున్నా కూడా దగ్గు, జలుబును తగ్గించుకోవచ్చు. ఈ రెండూ మన రోగ నిరోధక శక్తిని పెంచి సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న అల్లం ముక్కను దంచి అందులో కాస్త తేనె కలిపి తినాలి. దీంతో దగ్గు, జలుబు నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే 4 లేదా 5 లవంగాలను పెనంపై అలాగే వేయించి తింటుండాలి. లవంగాల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. దీంతో రోగాలు తగ్గుతాయి. శరీరంలోని బాక్టీరియా, వైరస్ నశిస్తాయి. దీంతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇలా ఈ చిట్కాలను వాడితే తప్పక ఫలితం ఉంటుంది.