Indra Movie : మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. నాలుగు దశాబ్ధాల సినీ చరిత్ర.. 150 సినిమాల సినీ ప్రస్థానం ఆయన సొంతం. అయితే చేసిన ఈ సినిమాల్లో కొన్ని మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటాయి. అప్పుడు ఇప్పుడు చిరు సినిమాలు హాట్ ఫేవరెట్ గా ఉండే సినిమాలు 10 నుంచి 20 దాకా ఉంటాయి. వాటిలో ముందు వరుసలో చెప్పుకునే సినిమాల్లో ఇంద్ర ఒకటి.
ఇంద్ర సినిమా కన్నా ముందు చిరు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. అవే మృగరాజు, శ్రీమంజునాథ. అయితే ఆ రెండు సినిమాల తర్వాత చిరు చేసిన సినిమా ఇంద్ర. ఈ సినిమాకి చిన్ని కృష్ణ కథ అందించగా.. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. బి.గోపాల్ ఇంద్ర సినిమాని డైరెక్ట్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా అప్పట్లో ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. 2002 లో ఇంద్ర సినిమా రూ.18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఇంద్ర స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. అప్పటివరకు చిరు సినిమాలు క్రియేట్ చేయలేని రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేసింది. ఇంద్ర సినిమా 123 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. 35 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడింది. ఇంద్ర సినిమా కలక్షన్స్ లో కూడా రికార్డుల మోత మోగించింది. టాలీవుడ్ లో మొదటి రూ.30 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా ఇంద్ర రికార్డ్ సృష్టించింది. ఇంద్ర సినిమా టోటల్ రన్ లో రూ.32 కోట్ల షేర్ తో వసూళ్ల సునామీ సృష్టించింది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు సైతం ఆ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయాయి. కొన్నాళ్ల పాటు ఆ రికార్డ్ అలాగే ఉంది.