మహా శివరాత్రి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉండే శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ రోజు భక్తులు శివుడికి అనేక పూజలు చేస్తుంటారు. లింగం రూపంలో ఉండే ఆయన్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. అయితే మహా శివరాత్రి రోజు భక్తులు కచ్చితంగా ఉపవాసం ఉంటారు. అలాగే రాత్రంతా జాగరణ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? ఇలా చేస్తే ఏం జరుగుతుంది ? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి ? అని చెప్పేందుకు ఒక కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. అతని పేరు సుస్వరుడు. అతను రోజూ అడవిలో జంతువులను వేటాడి సాయంత్రం వాటి మాంసాన్ని విక్రయించి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే ఒక రోజు అతను అడవిలో ఎంత తిరిగినా అతనికి ఒక్క జంతువు కూడా కనిపించదు. అలా అతను తిరుగుతూనే ఉంటాడు. మరోవైపు ఆకలి అవుతున్నా, దాహం అవుతున్నా.. పట్టించుకోకుండా వేట కొనసాగిస్తుంటాడు. కానీ ఒక్క జంతువు కూడా కనిపించదు. ఈ క్రమంలోనే రాత్రి అవుతుంది.
దీంతో తన దురదృష్టానికి అతను చింతిస్తూ.. అక్కడే ఉన్న ఒక బిల్వ వృక్షంపైకి ఎక్కి ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కిందకు వేస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. అయితే వాస్తవానికి ఆ రోజు మహాశివరాత్రి. ఆ విషయం సుస్వరుడికి తెలియదు. ఆ రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా అతను ఉపవాసం ఉన్నాడు. అలా అతని ఉపవాస దీక్ష జరిగింది. ఇక రాత్రంతా చెట్టు మీద ఉండి జాగరణ చేశాడు. దీంతో జాగరణ కూడా పూర్తయింది. తనకు తెలియకుండానే బిల్వ వృక్షం ఆకులను తెంపి కింద ఉన్న శివ లింగం మీద వేశాడు. దీంతో శివ పూజ కూడా పూర్తయింది. ఇవన్నీ అతనికి తెలియకుండానే జరిగాయి. ఈ క్రమంలోనే కొన్నాళ్లకు అతను మరణించాడు. తరువాత అతనికి ఎంతో పుణ్య ఫలం లభించింది. అతను నేరుగా కైలాసానికి వెళ్లాడు. మరుసటి జన్మను పొందలేదు. అదీ.. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ దీక్ష చేయడం వెనుక ఉన్న అసలు కారణం.
మహా శివరాత్రి రోజు ఆ విధంగా ఎవరైనా సరే ఉపవాసం ఉండి, జాగరణ దీక్ష చేసి శివున్ని ఆరాధిస్తే వారికి అమితమైన పుణ్య ఫలితం లభిస్తుంది. వారు చనిపోయాక నేరుగా కైలాసానికి చేరుకుంటారు. వారికి మరో జన్మ ఉండదు. అందుకనే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ దీక్షలను చేయాలని చెబుతుంటారు. ఇదీ.. వాటిని ఆచరించడం వెనుక ఉన్న అసలు కారణం..!