Aloo Vankaya Masala Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలనే నేరుగా వండడంతో పాటు వీటితో ఇతర కూరగాయలను కూడా కలిపి వండుతూ ఉంటాం. ఇలా బంగాళాదుంపలతో చేసుకోదగిన కూరలల్లో ఆలూ వంకాయ మసాలా కర్రీ కూడా ఒకటి. వంకాయలు, బంగాళాదుంప కలిపి చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ వంకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బేటి పొటాటో – పావు కిలో, పెద్ద ముక్కలుగా తరిగిన వంకాయలు – పావు కిలో, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 3, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత.
మసాలా దినుసులు..
నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, జీడిపప్పు – 5, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3.
ఆలూ వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో మపాలా దినుసులు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయ ముక్కలను వేసి 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత మసాలా పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉడికించిన బంగాళాదుంపలు, వేయించిన వంకాయ ముక్కలు, చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్, బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఆలూ వంకాయలు కలిపి చేసిన కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.