Corn Pakoda : మనం సాయంత్రం సమయాలలో తినడానికి మనకు రకరకాల చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. మనకు బయట దొరకడంతోపాటు ఇంట్లో తయారు చేసుకోవడానికి సులువుగా ఉండే చిరుతిళ్లల్లో పకోడీలు ఒకటి. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనం ఇంట్లో వివిధ రకాల పకోడీలను తయారు చేస్తూ ఉంటాం. అయితే మనం ఆహారంగా తీసుకునే మొక్కజొన్నలతో కూడా పకోడీలను తయారు చేయవచ్చని చాలా మందికి తెలియదు. మొక్కజొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిని తినడం వల్ల మన శరీరానికి అనేక రకాల విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. మొక్కజొన్న కంకులను మనం ఎక్కువగా కాల్చుకుని లేదా ఉడికించుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా మొక్కజొన్నలతో మనం ఎంతో రుచిగా ఉండే పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న లతో పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్కజొన్న గింజలు – ఒక కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – అర కప్పు, పచ్చి మిర్చి – 5, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
కార్న్ పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మొక్కజొన్న గింజలు, పచ్చి మిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. పిండి పలుచగా ఉన్నట్టయితే కొద్దిగా బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత పిండిని తీసుకుని పకోడీలలా వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే కార్న్ పకోడీ తయారవుతుంది. ఈ పకోడీ తయారీలో స్వీట్ కార్న్ ను ఉపయోగించరాదు. మొక్కజొన్న కంకులను ఎప్పుడూ తినే పద్దతిలో కాకుండా అప్పుడప్పుడూ ఇలా పకోడీలలా కూడా వేసుకోవచ్చు. సాయంత్రం సమయాలలో బయట దొరికే చిరు తిళ్లకు బదులుగా ఇలా మొక్కజొన్నలతో పకోడీలను వేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.