Soft Chapati : చపాతీలు అంటే చాలా మందికి ఇష్టమే. గోధుమ పిండితో చేసే వీటిని ఏ కూరతో లేదా పచ్చడితో అయినా సరే సులభంగా తినవచ్చు. తేలిగ్గా జీర్ణమవుతాయి కూడా. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటుంటారు. అయితే చపాతీలను చాలా మంది చేస్తుంటారు కానీ అవి మెత్తగా రావు. చేసిన కాసేపటికి గట్టిగా మారుతాయి. దీంతో తినడానికి అంతగా రుచిగా ఉండవు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో చపాతీలను సుతి మెత్తగా దూదిలా చేయవచ్చు. ఇక చపాతీలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీలను తయారు చేసే పిండి కలిపే సమయంలోనే జాగ్రత్త పాటించాలి. పిండికి అవసరమైనన్ని నీళ్లను పోసి కలపాలి. పిండి మెత్తగా ఉండేలా చూడాలి. అది చేతులకు అంటుకోకూడదు. అలాగే కాస్త నూనె లేదా నెయ్యి వేస్తే పిండి మరింత మెత్తగా మారుతుంది. దీంతో చపాతీలు మెత్తగా దూదిలా వస్తాయి. చపాతీ పిండి కలిపిన తరువాత కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీంతో పిండి మెత్తగా మృదువుగా మారుతుంది. చపాతీలు మెత్తగా వస్తాయి.
చపాతీల పిండి కలిపేందుకు గోరు వెచ్చని నీళ్లను ఉపయోగించాలి. దీంతో పిండి మెత్తగా వస్తుంది. అప్పుడు చపాతీలు కూడా మెత్తగా ఉంటాయి. చపాతీలను కర్రతో వత్తుతూ మొత్తం ఒకే సైజ్ ఉండేలా చూడాలి. మందం ఒకేలా ఉండాలి. లేదంటే చపాతీలు గట్టిగా మారుతాయి. చపాతీలను ఎల్లప్పుడూ మీడియంపై కాల్చాలి. అలాగే కొద్దిగా నెయ్యి లేదా నూనె వేస్తూ కాల్చాలి. రెండు వైపులా ఇలా కాలిస్తే చపాతీలు మెత్తగా వస్తాయి. ఇక చపాతీలను తయారు చేసిన తరువాత వేడిగా ఉంచే హాట్ బాక్స్ లో పెట్టాలి. లేదా అల్యూమినియం ఫాయిల్లో చుట్టి పక్కన పెట్టాలి. దీంతో వేడి పోకుండా ఉంటుంది. అప్పుడు ఎక్కువ సేపు ఉన్నా చపాతీలు మెత్తగానే ఉంటాయి. ఇలా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల చపాతీలను దూదిలా మెత్తగా తయారు చేసుకోవచ్చు.