Egg Dum Biryani : మనలో చాలా మంది కోడిగుడ్డును ఇష్టంగా తింటారు. ఉడికించిన కోడిగుడ్డుతో పాటు దానితో రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోదగిన వంటకాల్లో దమ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా కోడిగుడ్లతో దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, నూనె – 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 1, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, యాలకులు – 2, మరాఠి మొగ్గ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్ – పావు కప్పు, పచ్చిమిర్చి – 4 లేదా 5, పెద్ద ముక్కలుగా తరిగిన టమాట – 1, పెరుగు – పావు కప్పు, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు -తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నీళ్లు – 100 ఎమ్ ఎల్, నెయ్యి – 2 టీ స్పూన్స్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – 1, లవంగాలు – 4, యాలకులు – 4, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, మిరియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – 500 గ్రా., నీళ్లు – రెండు లీటర్లు, దాల్చిన చెక్క – 1, లవంగాలు – 3, యాలకులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే జార్ లో పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే మసాలా దినుసులు, అల్లం పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని వేసి 90 శాతం వరకు ఉడికించాలి. బియ్యం ఉడుకుతుండగానేమరో స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేయాలి. ఇందులోనే అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాయ్యాక మసాలాదినుసులు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట పేస్ట్, పెరుగు మిశ్రమం వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఇందులో బ్రౌస్ ఆనియన్స్ ను, కొత్తిమీరను, పుదీనాను, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత వేయించిన కోడిగుడ్లను, నీళ్లను పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమం నుండి సగం మిశ్రమాన్ని అలాగే సగం కోడిగుడ్లను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో కొద్దిగా కొత్తిమీరను, బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. దానిపై ఉడికించిన బాస్మతీ బియ్యాన్ని వడకట్టి వేయాలి. దీనిపై మిగిలిన మసాలా మిశ్రమాన్ని, కోడిగుడ్లను వేయాలి. తరువాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీరను, పుదీనాను చల్లాలి. అలాగే నెయ్యి కూడా వేయాలి. దీనిపై గార్నిష్ కోసం ఫుడ్ కలర్ ను కూడా వేసుకోవచ్చు.
తరువాత దీనిపై బటర్ పేపర్ ను లేదా టిష్యూ పేపర్ ను ఉంచి మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా చూసుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి దానిపై కళాయిని ఉంచాలి. దీనిని ముందుగా 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై, తరువాత 10నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఎగ్ దమ్ బిర్యానీని పది నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని అలాగే తినవచ్చు లేదా రైతా, మిర్చి కా సాలన్ వంటి కూరలతో కూడా కలిపి తినవచ్చు. ఇలా చేసిన ఎగ్ దమ్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.