Multi Grain Roti : చపాతీలు అంటే సాధారణంగా చాలా మంది గోధుమ పిండితో చేస్తుంటారు. ఇక కొందరు రాగులు లేదా జొన్నలతోనూ పిండి చేసి రొట్టెలు చేస్తుంటారు. అయితే అన్ని రకాల ధాన్యాలను ఉపయోగించి చపాతీలను ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. పిండిని ఎంత కలపాలి అనే విషయం తెలియదు. కానీ కింద తెలిపిన విధంగా చేస్తే అన్ని రకాల ధాన్యాలతోనూ ఎంతో రుచిగా చపాతీలను చేయవచ్చు. ఈ క్రమంలోనే మల్టీ గ్రెయిన్ రోటీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మల్టీ గ్రెయిన్ రోటీల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – పావు కప్పు, సజ్జ పిండి – పావు కప్పు, గోధుమ పిండి – పావు కప్పు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు, రాగి పిండి – పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కొత్తిమీర తురుము – 3 టేబుల్ స్పూన్లు, టమాటాలు – పావు కప్పు, పచ్చి మిర్చి ముక్కలు – ఒక టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా.
మల్టీ గ్రెయిన్ రోటీలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో అన్ని రకాల పిండిలను వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. అందులోనే మిగిలిన పదార్థాలను కూడా వేసి కలపాలి. తరువాత ముద్దను ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఓ ప్లాస్టిక్ కాగితం మీద నెయ్యి లేదా నూనె రాసి దాని మీద ఉండని పెట్టి చేత్తో వత్తుతూ రొట్టెలా చేయాలి. ఇప్పుడు దీన్ని నాన్ స్టిక్ పెనం మీద వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చాలి. దీంతో ఎంతో రుచికరమైన మల్టీ గ్రెయిన్ రోటీలు రెడీ అవుతాయి. వీటిని ఏ కూరతో అయినా సరే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడూ గోధుమ పిండితో చపాతీలను చేసేందుకు బదులుగా ఇలా అన్ని రకాల ధాన్యాలతో రొట్టెలను చేసి తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. కనుక ఇకపై రొట్టెలను ఇలా చేసి తినండి.