Potato Bites : మనం బంగాళాదుంపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూరలనే కాకుండా రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో పొటాటో బైట్స్ కూడా ఒకటి. ఫ్రీజ్ చేసిన పొటాటో బైట్స్ మనకు బయట మార్కెట్ లో కూడా లభిస్తాయి. వీటిని మనం నూనెలో వేయించుకుని తింటూ ఉంటాం. బయట లభించే విధంగా ఉండే ఈ పొటాటో బైట్స్ ను మనం చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పొటాటో బైట్స్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో బైట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మెత్తగా ఉడికించిన బంగాళాదుంపలు – పావు కిలో, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – ఒక టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, బియ్యం పిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పొటాటో బైట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యంపిండి వేసి గంటెతో కలుపుకోవాలి. అంతా కలిసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల పాటుపక్కకు పెట్టు కోవాలి.
ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపలను గడ్డలు లేకుండా మెత్తగా తురుముకోవాలి. ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అవసరమైతే ఒక టీ స్పూన్ నీటిని వేసి కలుపుకోవాలి. అంతా కలిసిన తరువాత కొత్తిమీరను, ఒక టీ స్పూన్ నూనెను వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు కావల్సిన ఆకారంలో బైట్స్ లా చేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక బైట్స్ ను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రంగు మారే వరకు వేయించుకుని టిష్యూపేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో బైట్స్ తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో బంగాళాదుంపలతో చాలా సులువుగా బైట్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఇలా తయారు చేసిన బైట్స్ ను అందరూ ఇష్టంగా తింటారు.