Usirikaya Thokku Pachadi : విటమిన్ సి అధికంగా ఉండే వాటిల్లో ఉసిరికాయలు ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఉసిరికాయలతో మనం ఎక్కువగా నిల్వ పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. అలాగే వీటితో మనం తొక్కు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే తొక్కు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అమ్మమ్మల కాలంలో ఈ పచ్చడిని ఎక్కువగా తయారు చేసేవారు. రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ తొక్కు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉసిరికాయలు – అర కిలో, పచ్చిమిర్చి – 150 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 50 గ్రా., రాళ్ల ఉప్పు – 100 గ్రా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండుమిరపకాయలు – 2, పసుపు – పావు టీ స్పూన్.
ఉసిరికాయ తొక్కు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. తరువాత పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాలి. తరువాత ఉసిరికాయలను ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో ఉసిరికాయ ముక్కలను , రాళ్ల ఉప్పును వేసుకుంటూ కచ్చా పచ్చగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పచ్చిమిర్చిని దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచుకోవాలి. ఇప్పుడు అన్నింటిని కలిపి మరోసారి దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో అర టీ స్పూన్ పసుపును కలిపి గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి చాలా కాలం వరకు తాజాగా ఉంటుంది. మనకు కావల్సినప్పుడు తగినంత పచ్చడిని తీసుకుని జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత ఈ పచ్చడిని తాళింపు పెట్టుకోవాలి. దీని కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడాయ్యక తాళింపు పదార్థాలను వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి కలపాలి. ఈ పచ్చడిని 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉసిరికాయ తొక్కు పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ తొక్కు పచ్చడిని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఉసిరికాయలోని ఔషధ గుణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి.