Heart Attack : ప్రస్తుత తరుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్ ల కారణంగా చనిపోతున్నారు. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా గుండె పోటు వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా చేయడం, అధిక బరువు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, పొగ తాగడం.. వంటి పలు కారణాల వల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ వస్తోంది. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొందరిలో పలు లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ వారు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

గుండె పోటు వచ్చేందుకు చాలా రోజుల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతిలో నొప్పి, చాలా బలహీనంగా ఉండడం, చేతులు, పాదాల్లో స్పర్శ లేనట్లు ఉండడం, ఎడమ వైపు మెడ, భుజాలు, దవడల్లో నొప్పి.. వంటి లక్షణాలు ఎవరిలో అయినా తరచూ కనిపిస్తుంటే.. అది కచ్చితంగా హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుందని అంటున్నారు. కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా తరచూ కనిపిస్తుంటే ఏమాత్రం అశ్రద్ధ చేయరాదని.. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలని.. అవసరం అయితే చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.
ఇక గుండె సమస్య ఉన్నవారు చిన్నపనిచేసినా చాలా త్వరగా అలసిపోతుంటారు. మెట్లు ఎక్కలేకపోతుంటారు. అంతకు ముందు సామర్థ్యం ఎక్కువగా ఉన్నవారు కూడా శక్తి లేనట్లు అయిపోతారు. బరువులు అసలు ఎత్తలేరు. చిన్న పనిచేసినా ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రంగా చెమటలు పట్టడం.. వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే అసలు నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక కరోనా బారిన పడి కోలుకున్న వారిలో పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వారి గుండె దెబ్బ తినే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని.. కనుక అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు అంటున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందిలో ఊపిరితిత్తులు, గుండె దెబ్బ తింటున్నాయని.. దీంతో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. కోవిడ్ బారిన పడి కోలుకున్నవారిలో హార్ట్ ఎటాక్‌లు బాగా వస్తున్నాయని.. వారిలో బ్లడ్ క్లాట్ అయి ఈ విధంగా జరుగుతుందని అంటున్నారు. కనుక కోవిడ్ బారిన పడినవారు పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని.. వారికి హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు ఇతరుల కన్నా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు ఏడాది వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.