Coffee Tea : మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ, టీ లను తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఉదయం పూట లేవగానే కాఫీ, టీ లను తాగడం కూడా ఒక వ్యసనమే అని చెప్పవచ్చు. ఇలా తాగడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన మెదడులో ఉండే నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీని కారణంగా కాఫీని తాగిన అర గంట సమయంలోపే మన శరీరంలోకి ఏదో తెలియని కొత్త శక్తి వచ్చినట్టుగా మనం ఉత్సాహంగా పని చేస్తూ ఉంటాం. ఈ కెఫీన్ ప్రభావం మన నాడీ వ్యవస్థపై 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది. ఈ ప్రభావం తగ్గగానే మళ్లీ మనకు కాఫీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. దీంతో మనం కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటాం.
ఇలా కాఫీలనే తాగడం మనకు వ్యసనంగా మారిపోతుంది. కెఫీన్ ప్రభావం తగ్గగానే మనం కాఫీని తాగక పోతే శరీరం దుష్పభ్రావాల బారిన పడుతుంది. నీరసంగా ఉండడం, తలనొప్పి రావడం, పొట్టలో యాసిడ్లు తయారవడం వంటి దుష్పభ్రవాలు కాఫీని తాగక పోవడం వల్ల కలుగుతాయి. బ్లాక్ కాఫీ, టీలను తాగడం వల్ల కూడా శరీరం ఇలాంటి దుష్ప్రభావాల బారిన పడుతుంది. అంతే కాకుండా మన శరీరానికి మనం తినే ఆహారం ద్వారా వచ్చే రసాయనాలను, వ్యర్థాలను తొలగించడమే కాకుండా రక్తం, రక్త నాళాలను, శరీరంలోని ఇతర అవయవాలను శుభ్రపరిచి వాటిల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపించే గుణం ఉంది. ఈ ప్రక్రియ మన శరీరంలో మనం రాత్రి తిన్న ఆహారం జీర్ణమయిన తరువాత జరుగుతుంది.
కనుక సుమారుగా తెల్లవారు జామున నుండి శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం రాత్రి తినే ఆహారాన్ని త్వరగా తీసుకోవడమే కాకుండా, సులువుగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ రాత్రి నుండే ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే కాఫీలను, టీ లను తాగడం వల్ల శరీరంలో ఈ ప్రక్రియ జరగదు. మనం తాగిన కాఫీ, టీలను జీర్ణం చేయడానికి శరీరం అంతా ప్రయత్నిస్తుంది. జీర్ణక్రియ ప్రారంభం అవ్వగానే శరీరంలో ఉండే ఇతర అవయవాలను శుభ్రపరిచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ఆగిపోతుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు పేరుకు పోయి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఉదయం లేవగానే కాఫీలను, టీలను తాగకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు.