High BP : మనకు ప్రకృతి అనేక రకాల పండ్లను ప్రసాదించింది. ఈ పండ్లల్లో కొన్ని మన ప్రాంతంలో లభించనివి కూడా ఉంటాయి. కానీ ప్రస్తుత తరుణంలో మార్కెట్ బాగా అభివృద్ది చెందింది. దీంతో అన్ని రకాల పండ్లు మనకు లభిస్తున్నాయి. ఇలా లభించే పండ్లల్లో కివి ఫ్రూట్ ఒకటి. వీటి ధర అధికంగా ఉన్నప్పటికీ వీటిని తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మూడు కివీ పండ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కివీ పండ్లల్లో ఉండే సమ్మేళనాలు బీపీని నియంత్రించడంలో సహాయపడతాయని, దీని వల్ల 20 శాతం వరకు బీపీ నియంత్రణలోకి వస్తుందని వారు చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే బీపీ బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, ఉప్పును అధికంగా వాడడం, అధిక బరువు వంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. చిన్న వయస్సు నుండే బీపీని నియంత్రించడానికి మందులను వాడవలసిన పరిస్థితి నెలకొంది. వీటిని వాడడం వల్ల అనేక ఇతరత్రా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తోంది.
కచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తూ, కివీ పండ్లను తినడం వల్ల మందుల వాడకం తగ్గి బీపీ నియంత్రణలోకి వస్తుంది. దీంతోపాటుగా 100 గ్రా. ల కివీ పండ్లను 8 వారాల పాటు ప్రతి రోజు తీసుకోవడం వల్ల చెడు కొలస్ట్రాల్ (ఎల్‌డీఎల్), ట్రై గ్లిజరాయిడ్స్ (రక్తంలో కొవ్వు) స్థాయిలు 30 శాతం వరకు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కివి పండ్లల్లో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు ప్రేగులల్లో అల్సర్ లు రాకుండా చేయడంలో సహాయపడతాయి.
100 గ్రా. ల కివీ పండ్లల్లో 61 క్యాలరీల శక్తి ఉంటుంది. ఈ పండ్లు 80 శాతం వరకు నీటిని కలిగి ఉంటాయి. 100 గ్రా. కివీ పండ్లల్లో 93 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అంతే కాకుండా ఎఇఎసి అనే యాంటీ ఆక్సిడెంట్ కివీ పండ్లల్లో అధికంగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి తో కలిసి వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గులను నివారించడంలో సహాయపడుతుంది. తరుచూ జలుబు, దగ్గులతో బాధపడే వారు కివి పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అనారోగ్యాల బారిన పడేలా చేసే ఆహార పదార్థాలను తినడం కంటే ఇలా ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.