Food For Knee Pain : కీళ్ల నొప్పులు.. ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. ఒకప్పుడు 40 ఏండ్లు పైబడిన వారిలోనే మనం కీళ్ల నొప్పులను, ఆర్థరైటిస్ నొప్పులను చూసేవారు. కానీ ప్రస్తుత కాలంలో యువతలోనూ మనం ఈ సమస్యను గమనించవచ్చు. ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి అనేక కారణాల వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కీళ్ల నొప్పులు రావడానికి మరో కారణం ఎముకల్లో క్యాల్షియం లేకపోవడం. క్యాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.
దీని వల్ల చిన్న ప్రమాదాలకే ఎముకలు విరగడం, కీళ్ల నొప్పులు రావడం వంటి సమస్యల బారిన పడుతుంటాం. తగినంత క్యాల్షియాన్ని తీసుకోవడం వల్ల కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. క్యాల్షియం ఉండే ఆహారపదార్థాలైనా పెరుగు, అటుకులతో ఒక వంటకాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులను, ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించే ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా కళాయిలో రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మునగాకు, పసుపు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చిని, అల్లం తరుగును, ఉప్పును వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నానబెట్టుకున్న అటుకులను నీళ్లు పిండి వేసి కలుపుకోవాలి.
అటుకులు వేగిన తరువాత పెరుగు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అటుకులను, పెరుగును కలిపి వండి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించే మరో వంటకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని తయారు చేసుకోవడానికి కూడా మనం అటుకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో ఆలివ్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మునగాకు, అల్లం ముక్కలు, పసుపు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.
తరువాత టమాట ముక్కలు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత క్యారెట్ తురుము, ఉప్పు వేసి వేయించాలి. క్యారెట్ తురుము వేగిన తరువాత నానబెట్టుకున్న అటుకులను నీళ్లు పిండి వేసి కలుపుకోవాలి. అవసరమైతే ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. ఈ అటుకులపై కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని గిన్నెలోకి తీసుకుని తినాలి. ఈ విధంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారు అటుకులతో ఈ వంటకాలను చేసి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.