Wheat Laddu : గోధుమలతో మనం సహజంగానే చపాతీలు, పూరీలను తయారు చేస్తుంటాం. గోధుమ రవ్వతో చేసే ఉప్మా కూడా రుచిగా ఉంటుంది. అయితే గోధుమలతో మనం లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోషకాలను అందిస్తాయి. వీటిని రోజుకు ఒకటి తింటే చాలు.. మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ లడ్డూలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని రోజుకు ఒకటి చొప్పున తినవచ్చు. ఇక ఈ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, చక్కెర – అర కప్పు, నెయ్యి – పావు కప్పు, బాదం పప్పు – 15, జీడిపప్పు -15, యాలకుల పొడి – ఒక టీస్పూన్, ఎండు ద్రాక్ష – 2 టీస్పూన్లు.
గోధుమ లడ్డూలను తయారు చేసే విధానం..
చక్కెర పొడి చేసి పెట్టుకోవాలి. కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదంపప్పు దోరగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. అదే కళాయిలో నెయ్యి వేసి గోధుమ పిండిని వేయించాలి. వేగాక కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు దాన్ని ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అందులో చక్కెర పొడి, బాదం, జీడిపప్పు మిశ్రమం, యాలకుల పొడి, ఎండు ద్రాక్ష వేసి బాగా కలుపుతూ లడ్డూలలా తయారు చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన గోధుమ లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి చొప్పున తింటే ఎంతో మేలు జరుగుతుంది.