Cauliflower Curry : క్యాలీప్లవర్ తో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే పులావ్, బిర్యానీ వంటి వాటిల్లో కూడా ఈ క్యాలీప్లవర్ ను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. క్యాలీప్లవర్ తో తరచూ చేసే వంటకాల కంటే కింద చెప్పిన విధంగా చేసే క్యాలీప్లవర్ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. క్యాలీప్లవర్ ను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. అలాగే ఈ కూరను చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన క్యాలీప్లవర్ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), నూనె – 4 టీ స్పూన్స్, యాలకులు – 2, లవంగాలు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చి బఠాణీ – ఒక గుప్పెడు, ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, టమాటాలు – 3, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాలీప్లవర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని అందులో ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ఇందులో క్యాలీప్లవర్ ముక్కలను వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలుపుతూ రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చి బఠాణీని వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ గా చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ను ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత టమాటాలను కూడా పేస్ట్ లా చేసుకుని వేసుకోవాలి. తరువాత ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఇందులో నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ముందుగా వేయించిన క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ మసాలా కూర తయారవుతుంది. అన్నం, చపాతీ, పూరీ వంటి వాటితో ఈ కూరను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే క్యాలీప్లవర్ కూరల కంటే ఈ విధంగా చేసిన క్యాలీప్లవర్ కూర మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.