India Vs West Indies : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ చివరి వరకు దూకుడుగా ఆడింది. అయితే పరుగుల వేటలో చివర్లో వెనుకబడింది. దీంతో వెస్టిండీస్‌పై భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లి 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టగా షెల్డాన్ కాట్రెల్, రొమారియో షెపర్డ్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో నికోలాస్ పూరన్ 62 పరుగులు (5 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా.. రోవ్‌మెన్ పవెల్ 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్‌లకు తలా 1 వికెట్ దక్కింది. ఈ టీ20లో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో చివరిదైన మూడో టీ20 ఈ నెల 20వ తేదీన రాత్రి 7 గంటలకు జరగనుంది.