Sweet Rasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాము. రసం చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలను కూడా రసంతో తింటూ ఉంటాము. రసంతో అందరూ ఎంతో తృప్తిగా భోజనం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం సాధారణంగా రసాన్ని కారం వేసి తయారు చేస్తూ ఉంటాము. తరచూ చేసే రసంతో పాటు మనం బెల్లం తురుము వేసి తియ్యటి రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కారం వేయకుండా చేసే ఈ తియ్యటి రసం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా ఉండే ఈ తియ్యటి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతపండు రసం – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, రసం పొడి – ఒక టీ స్పూన్, పసుపు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీస్పూన్, మెంతులు – అర టీ స్పూన్, ఎండుమిర్చి -3, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
స్వీట్ రసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బెల్లం పొడి వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు, రసం పొడి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న రసాన్ని వేసి కలపాలి. దీనిని చిన్న మటంపై మరో 3 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ రసం తయారవుతుంది. దీనిని అన్నం, ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ రసాన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.