Constipation : మనం తిన్న ఆహారం జీర్ణమయిన తరువాత అందులో ఉండే పోషకాలు రక్తంలోకి గ్రహించబడతాయి. జీర్ణం కాని ఆహార పదార్థాలు, పీచు పదార్థాలు పెద్ద ప్రేగుల్లోకి చేర్చబడతాయి. ఇలా పెద్ద ప్రేగుల్లోకి చేర్చబడిన ఆహార పదార్థాలే మలంగా బయటకు విసర్జించబడతాయి. కానీ ప్రస్తుత తరుణంలో ఉన్న ఆహారపు అలవాట్ల కారణంగా పాలిష్ చేసిన ఆహార పదార్థాలను, రిఫైన్ చేసిన ఆహారపు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాం. పండ్లకు, కూరగాయలకు కూడా పైన ఉండే పొట్టును తీసి మనం ఆహారంగా తీసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల మనం తినే ఆహార పదార్థాలలో పీచు పదార్థాలు తగ్గి ప్రేగులను శుభ్రపరిచే ప్రక్రియ తగ్గుతోంది.
పీచు పదార్థాలు లేని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ప్రేగులల్లో కదలికలు తగ్గడం, హాని కలిగించే సూక్ష్మ జీవులు పెరగడంతోపాటు వ్యర్థాలు పేరుకు పోయి మలబద్దకం సమస్య తీవ్రంగా మారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా వ్యర్థాలు ప్రేగులల్లో పేరుకు పోవడం వల్ల ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్యను వీటన్నింటికీ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మలబద్దకం సమస్యను తగ్గించడంలో కివీ పండ్లు ఎంతో సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మలబద్దకం సమస్య ఉన్న వారిలో మలం మెత్తగా తయారవడం, ఎక్కువ మోతాదులో మలం తయారవడంతోపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మలవిసర్జన జరగడంలో కివీ పండ్లు ఎంతో సహాయపడతాయి. కివీ పండ్లల్లో ఉండే ఫైబర్ ప్రేగులలో కదలికలను పెంచి మలాన్ని మెత్తగా చేయడంలో దోహదపడుతుంది. 100 గ్రా. ల కివీ పండ్లల్లో 61 క్యాలరీల శక్తి , 93 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ కివీ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి.
ప్రేగులల్లో కదలికలు తక్కువగా ఉన్న వారు, మలబద్దకం సమస్య ఉన్న వారు కివీ పండ్లను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు పీచు పదార్థాలు ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం, రోజూ ఉదయం పరగడుపునే లీటర్ నుండి లీటర్‌న్నర గోరు వెచ్చని నీటిని తాగడం వంటివి చేయడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.