Neem Leaves : ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ మొక్కల్లో వేప చెట్టు ఒకటి. ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. వేప చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. వేప చెట్టు గాలి సోకిన కూడా మన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వేప చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పేవ చెట్టు చేదు రుచిని కలిగి ఉంటుందని చాలా మంది దీనిని ఉపయోగించడానికి ఇష్టపడరు. కానీ రోజూ 2 వేప ఆకులను పరగడుపున తినడం వల్ల మన శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులు కలుగుతాయి. దాదాపు కొన్ని వందల సంత్సరాల నుండి మనం వేప చెట్టును ఔషధంగా ఉపయోగిస్తూ ఉన్నాం. వేప ఆకులు చేదుగా ఉన్నప్పటికి వాటిలో వాత లక్షణాలను క్రమబద్దీకరించే శక్తి ఉంది. అలాగే రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలను, మలినాలను తొలగించే గుణం కూడా ఉంది. శరీరం నుండి ఫ్రీరాడికల్స్ ను తొలగించే ప్రక్రియను వేప ఆకులు వేగవంతం చేస్తాయి.
వేప ఆకులను సరైన పద్దతిలో ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. శరీరంలో వాపులను, జ్వరాలను, చర్మ సంబంధిత సమస్యలను, దంత సమస్యలను, జీర్ణ సంబంధిత సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలను నయం చేయడంలో వేప చెట్టు మనకు సహాయపడుతుంది. పాతకాలంలో ఫ్లూ వంటి సమస్యలతో బాధపడే వారి వద్ద వేప ఆకులను ఉంచుతారు. అలాగే ఇంటికి తోరణాలుగా కూడా వేప ఆకులను కడతారు. వేప ఆకులను తోరణంగా కట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి వచ్చే గాలి స్వచ్ఛంగా మారుతుంది. మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. అలాగే ప్రతి రోజూ రెండు లేత వేపాకులను నమిలి తినాలి. లేత వేపాకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇలా వేప ఆకులను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణం వేపాకులకు ఉంది. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే మధుమేహం బారిన పడకూడదు అనుకునే వారు కూడా ఈ వేపాకులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా పరగడుపున వేపాకులను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పొట్టలో ఉండే క్రిములు, నులి పురుగులు నశిస్తాయి. గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట, ప్రేగులు శుభ్రపడతాయి. వేపాకులను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.
అలాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజూ రెండు వేపాకులను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దీంతో చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే వేపాకుల్లో పసుపును కలిపి మెత్తగా నూరి సమస్యలు ఉన్న చోట చర్మంపై లేపనంగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే వేపాకులను తినడం వల్ల లేదా వేపాకులను పేస్ట్ గా చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా మారుతుంది. కంటి చూపు మందగించడం, కళ్లు మంటలు వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు వేపాకులను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వేపాకులతో చేసిన కషాయంతో కళ్లను కడుక్కోవడం వల్ల కళ్ల అలసట తగ్గి కళ్లకు చక్కటి విశ్రాంతి లభిస్తుంది.
అలాగే వేపాకులను తినడం వల్ల లేదా వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. వివిధ రకాల దంతాల సమస్యలు రాకుండా ఉంటాయి. వేప నూనెను లేదా వేపాకుల పేస్ట్ ను కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులపై రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అలాగే వేపాకులతో ఇంట్లో పొగ వేయడం వల్ల లేదా వేపాకుల కషాయాన్ని ఇంట్లో చల్లడం వల్ల క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు ఈ వేపాకులకు దూరంగా ఉండాలి. ఈ విధంగా రోజూ ఉదయం రెండు వేపాకులను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని , వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.