Hotel Style Sambar : మనలో చాలా మంది సాంబార్ తో భోజనం చేయడానికి ఇష్టపడతారు. మనం తరచూ ఈ సాంబార్ ను తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సాంబార్ మనకు హోటల్స్ లో కూడా లభిస్తుంది. హోటల్స్ లో లభించే విధంగా రుచిగా ఉండే సాంబార్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. హోటల్స్ లో లభించే ఈ సాంబార్ రుచిగా, చిక్కగా చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తినే ఈ సాంబార్ ను హోటల్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ముప్పావు కప్పు, నీళ్లు – 200 ఎమ్ ఎల్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన బెండకాయలు – 2, గుమ్మడి ముక్కలు – పావు కప్పు, తరిగిన మునక్కాయ – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, చింతపండు రసం – 100 ఎమ్ ఎల్, కారం – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, బెల్లం – ఒక ఇంచు ముక్క.
సాంబార్ పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 15, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – ముప్పావు టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు.
హోటల్ స్టైల్ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కందిపపప్పును ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ కందిపప్పును కుక్కర్ లో వేసి నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే పసుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చి కొబ్బరి తురుము తప్ప పేస్ట్ కు కావల్సిన మిగిలిన పదార్థాలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి వేయించాలి.
కూరగాయ ముక్కలు 50 శాతం వేగిన తరువాత లీటర్ నీళ్లు, ఉడికించిన పప్పు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత దీనిని మూత పెట్టి 10 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. తరువాత చింతపండు రసం, కారం, 2 రెమ్మల కరివేపాకు, బెల్లం ముక్క వేసి కలిపి మరో 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ తయారవుతుంది. దీనిని ఇడ్లీ అలాగే అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ లో ఇతర కూరగాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి తగినట్టు మరికొన్ని నీళ్లను కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన సాంబార్ ను ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు.