Sweet Rava Balls : మనం బొంబాయి రవ్వతో ఉప్మానే కాకుండా రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ రవ్వతో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన చిరుతిళ్లలో రవ్వ బాల్స్ కూడా ఒకటి. రవ్వ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా వీటిని సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే రవ్వ బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, పంచదార – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నెయ్యి – 2 టీ స్పూన్స్.
రవ్వ బాల్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పాలు,పంచదార, యాలకుల పొడి వేసి వేడి చేయాలి. పాలు మరిగి ఒక పొంగు వచ్చిన తరువాత రవ్వ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. రవ్వ మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. రవ్వ చల్లారిన తరువాత దీనిని బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ మనకు ఉండలుగా చేసుకోవాలి లేదా మనకు నచ్చిన ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో ఉండను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బాల్స్ తయారవుతాయి. ఈ రవ్వ బాల్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు రవ్వతో ఇలా ఎంతో రుచిగా ఉండే బాల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.