Tablets : మనకు ఎలాంటి అనారోగ్యం కలిగినా డాక్టర్ వద్దకు వెళ్లి లేదంటే సొంతంగా వైద్యం చేసుకోదలచి టాబ్లెట్లు, క్యాప్సూల్స్ వంటివి వేసుకుంటాం. దీంతో అస్వస్థత నుంచి దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎవరు టాబ్లెట్లు వేసుకున్నా మంచి నీరు తప్పనిసరి. నీటితోనే టాబ్లెట్ వేసుకోవాలి. అలా అని మనకు వైద్యులు కూడా చెబుతారు. అయితే కొందరు మాత్రం ఈ సలహాను పెడచెవిన పెడతారు. నీళ్లు లేకుండానే కేవలం టాబ్లెట్‌నే అలాగే డైరెక్ట్‌గా మింగేస్తారు. దీని వల్ల ఏం జరుగుతుంది, అని ఆలోచించరు. ఈ క్రమంలో మనం అసలు టాబ్లెట్లను నీటితోనే ఎందుకు వేసుకోవాలి..? ఎంత నీటితో వేసుకోవాలి..? అసలు నీటితో టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది..? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ ఏవైనా ఎవరైనా కచ్చితంగా వాటిని నీటితోనే వేసుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా మింగి అప్పుడు టాబ్లెట్ వేసుకుని మింగేయాలి. ఆ తరువాత గ్లాస్‌లో ఉన్న నీటిని మొత్తం తాగాలి. ఇలా చేయడం వల్ల మనం మింగిన టాబ్లెట్ లేదా కాప్సూల్ నేరుగా జీర్ణాశయానికి చేరుతుంది. ఎలాంటి ఆటంకం కలగకుండా అది కరుగుతుంది. అప్పుడు ఆ మెడిసిన్ వల్ల మనకు అనారోగ్యం త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
అయితే కొందరు కేవలం టాబ్లెట్‌నే డైరెక్ట్‌గా అలాగే వేసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే.. టాబ్లెట్ ఒక్కోసారి గొంతులో ఇరుక్కోవచ్చు. అలా అయితే ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులు షాక్‌కు లోనై పడిపోతారు. దీంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఒక్కోసారి గాలి ఆడక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒక వేళ గొంతులో కాకపోయినా ఆ టాబ్లెట్ జీర్ణకోశం గోడలకు అతుక్కుంటుంది. దీంతో సరిగ్గా కరగదు. అప్పుడు ఆ మెడిసిన్ వేసుకుని కూడా ప్రయోజనం ఉండదు. దీనికి తోడు కొన్ని రకాల టాబ్లెట్లను అలా వేసుకుంటే కడుపులో అల్సర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కనుక ఎవరైనా టాబ్లెట్ లేదా క్యాప్సూల్స్‌ను కచ్చితంగా నీటితో వేసుకోవాల్సిందే. అది కూడా ఒక గ్లాస్‌కు తక్కువ నీరు కాకుండా చూసుకోవాలి. అయితే పూర్తిగా చల్లని లేదా వేడి నీటితో మాత్రం మందులు వేసుకోకూడదు. అలా వేసుకున్నా ఆ మందులు సరిగ్గా కరగవు. శరీరం వాటిని సరిగ్గా గ్రహించదు. కనుక టాబ్లెట్లు వేసుకునే విషయంలో పైన చెప్పిన జాగ్రత్తలు మాత్రం ఎవరైనా సరే కచ్చితంగా పాటించాల్సిందే.