Bendakaya Fry : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బెండకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. బెండకాయలతో ఎక్కువగా మనం వేపుడును తయారు చేస్తూ ఉంటాం. బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బెండకాయ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ వేపుడును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. శనగపిండి వేసి చేసే ఈ బెండకాయ వేపుడు చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మరింత రుచిగా ఈ బెండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బెండకాయలు – అర కిలో, శనగపిండి – పావు కప్పు, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, నిమ్మకాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో శనగపిండి వేసి వేయించాలి. దీనిని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగపిండి చల్లారిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి పిండిని ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఇంగువ, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. బెండకాయ ముక్కలు గ సగం వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత అల్లం పేస్ట్ వేసి వేయించాలి. బెండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మంటను చిన్నగా చేసి ముందుగా కలుపుకున్న శనగపిండిని వేసి కలపాలి. ఈ ముక్కలను రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బెండకాయ ఫ్రై కంటే ఈ విధంగా చేసిన బెండకాయ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.