Bitter Gourd Pakoda : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో కాకరకాయ ఒకటి. ఇది చేదుగా ఉంటుంది.. అన్న మాటే కానీ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు కాకరకాయలలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువును తగ్గించడంలో, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడంలో కాకరకాయ సహాయపడుతుంది. మనం కాకరకాయలతో ఎక్కువగా వేపుడు, పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. అయితే కాకరకాయలతో మనం పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయలతో చేసే పకోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇక కాకరకాయల పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయల పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకర కాయలు – 5 (పెద్దవి), పసుపు – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, శనగ పిండి – 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్, కారం పొడి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, ఉప్పు – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కు సరిపడా.
కాకరకాయల పకోడీ తయారీ విధానం..
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి పలుచగా గుండ్రటి ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపును వేసి కాకర కాయ ముక్కలకు పట్టేలా బాగా కలిపి మూత పెట్టి అర గంట పాటు పక్కన ఉంచాలి. తరువాత చేత్తో పిండుతూ కాకరకాయ ముక్కలల్లో ఉండే నీటినంతటినీ తీసి వేయాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలపై నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. కళాయిలో నూనె పోసి కాగాక కాకర కాయ ముక్కలను పకోడిలా వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ పకోడీలు తయారవుతాయి. తరచూ చేసుకునే పకోడీలకు బదులుగా ఇలా అప్పుడప్పుడూ కాకరకాయ పకోడీలను తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.