Choco Burfi : కోకో పౌడర్ తో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. కోకో పౌడర్ ను తీసుకోవడం వల్ల మనం రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, గుండె జబ్బులను అరికట్టడంలో ఈ కోకో పౌడర్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఎక్కువగా కుక్కీస్, స్మతీస్, మిల్క్ షేక్స్, కేక్స్ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ కోకో పౌడర్ తో ఎంతో రుచిగా ఉండే బర్ఫీని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా ఉండే ఈ చాకో బర్ఫీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాకో బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మిల్క్ పౌడర్ – ఒక కప్పు, కోకో పౌడర్ – అర కప్పు, పంచదార – ఒక కప్పు, పాలు – అర కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక కప్పు.
చాకో బర్ఫీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పంచదార, పాలు వేసి వేడి చేయాలి. దీనిని లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలిపిన తరువాత కోకో పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు నూనె వేసి కలపాలి. నూనె, కోకో మిశ్రమం అంతా కలిసే వరకు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో పది నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కోకో మిశ్రమం కళాయికి అంటుకోకుండా వేరవుతుంది. ఇలా వేరవగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిని కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాకో బర్ఫీ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇలా ఇంట్లోనే చాకో బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలు ఈ బర్ఫీని మరింత ఇష్టంగా తింటారు.