Dosakaya Roti Pachadi : మనం పచ్చడి చేసుకోదగిన కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలతో కూర, వేపుడు వంటి వాటితో పాటు మనం పచ్చడిని కూడా తయారు చేస్తాము. దొండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగాఉంటుంది. అలాగే ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పవచ్చు. దొండకాయలతో మరింత రుచిగా, కమ్మగా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, దొండకాయ ముక్కలు – 300 గ్రా., పచ్చిమిర్చి – 15, చింతపండు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కొత్తిమీర – అర కట్ట.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – 2 చిటికెలు, కరివేపాకు – ఒక రెమ్మ.
దొండకాయ రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తరువాత చింతపండు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ముక్కలు చల్లారిన తరువాత ముందుగా రోట్లో లో వేయించిన దినుసులు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
తరువాత వేయించిన దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ రోటి పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని మిక్సీలో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.