Putnalu : పుట్నాలు.. ఇవి మనందరికి తెలిసినవే. చట్నీల తయారీలో, వంటల్లో, కారం పొడుల తయారీలో వీటిని వాడుతూ ఉంటాము. అలాగే కాలక్షేపానికి కూడా వీటిని మనం తింటూ ఉంటాము. పుట్నాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పుట్నాలను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి. వీటిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో ఇలా అనేక రకాలుగా పుట్నాల పప్పు మనకు సహాయపడుతుంది.
అయితే సాధారణంగా మనం పుట్నాలను బయట మార్కెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటాము. కానీ నల్ల శనగలు ఉంటే చాలు ఈ పుట్నాలను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే పుట్నాల పప్పును సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక కళాయిలో 2 కప్పుల ఉప్పును తీసుకుని పెద్ద మంటపై బాగా వేడి చేయాలి. ఉప్పు బాగా వేడైన తరువాత గుప్పెడు నల్ల శనగలను తీసుకుని ఉప్పులో వేసి కలుపుతూ వేయించాలి. ఇలా వేయించడం వల్ల కొద్ది సేపటికి శనగలు పుట్నాలుగా మారతాయి. వీటిని వెంటనే జల్లి గంటలోకి తీసుకుని జల్లించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అవసరమైనని పుట్నాలను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పుట్నాలు మధ్య మధ్యలో ఉప్పు రుచి తగులుతూ తినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఈ విధంగా ఇంట్లోనే పుట్నాలను తయారు చేసుకుని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.