Instant Besan Dosa : శనగపిండిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో బజ్జీ, పకోడీ వంటి వాటినే కాకుండా రకరకాల పిండి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే వంటకాలు చాలా రుచిటా ఉంటాయి. ఇవే కాకుండా శనగపిండితో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా శనగపిండితో దోశలను తయారు చేసుకుని తినవచ్చు. శనగపిండితో దోశలను తయారు చేయడం ఎంతో సులభం. అలాగే ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి. శనగపిండితో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా దోశలను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బేసన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, తురిమిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, వాము – ఒక టీ స్పూన్, ఉప్పు -తగినంత, నూనె – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – అర గ్లాస్.
బేసన్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే మరికొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. ఈ దోశ మామూలు దోశ లాగా పలుచగా ఉండదు. ఊతప్పం మాదిరి ఉంటుంది. ఈ దోశను ఒక వైపు కాల్చుకున్న తరువాత మరో వైపుకు తిప్పి నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేసన్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా శనగపిండితో అప్పటికప్పుడు ఎంతో రుచికరమైన దోశలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.