Instant Oats Dosa : మన ఆరోగ్యానికి మేలు చేసే ధాన్యాల్లో ఓట్స్ కూడా ఒకటి. వీటిని మనం ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. ఓట్స్ వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు సహాయపడతాయి. ఓట్స్ ను పాలల్లో వేసి తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఓట్స్ తో సులభంగా తయారు చేసుకోగలిగిన వంటకాల్లో ఓట్స్ దోశ కూడా ఒకటి. ఓట్స్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా ఓట్స్ తో దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ ఓట్స్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, బియ్యం పిండి – ముప్పావు కప్పు, బొంబాయి రవ్వ – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పుల్లటి పెరుగు – ఒక కప్పు.
ఇన్ స్టాంట్ ఓట్స్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఓట్స్ వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ ఓట్స్ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని అట్టులా వేసుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై కాల్చుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తరువాత అంచుల వెంబడి నూనె వేసి కాల్చుకోవాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఈ దోశ మందంగా ఉంటుంది. కనుక ఇది కాలడానికి సమయం ఎక్కువగా పడుతుంది.
దోశను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఓట్స్ తో ఈ విధంగా దోశను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఓట్స్ తో దోశలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.