Mutton Keema Curry : ప్రోటీన్స్ ను అధికంగా కలిగిన ఆహారాలలో మటన్ కూడా ఒకటి. చాలా మంది మటన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. మటన్ తో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. మటన్ ను ముక్కలుగా కాకుండా కీమా లాగా చేసి కూడా తింటుంటారు. మటన్ కీమాతో కూడా వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మటన్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కీమా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ కీమా – పావు కిలో, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక గ్లాస్, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ కీమా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనెను వేసి నూనె కాగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్ కీమాను వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంటపై మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత తగినన్ని నీళ్లను పోసి కలిపి కీమాను పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ కీమా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.