Pachi Batani Masala Curry : మనం బఠాణీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బఠాణీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా బఠాణీలు మనకు సహాయపడతాయి. బఠాణీలను ఎక్కువగా మనం ఇతర వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర వంటకాల్లో ఉపయోగించడంతో పాటు మనం బఠాణీలతో ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. బఠాణీ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బఠాణీలతో ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బఠాణీ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి బఠాణీ – ఒక కప్పు, తరిగిన బంగాళాదుంప – 1, గుండ్రటి ముక్కలుగా తరిగిన క్యారెట్ – 1, తరిగిన టమాటాలు – 2, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 10, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్.
బఠాణీ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత పచ్చి బఠాణీ, క్యారెట్, బంగాళాదుంప వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి కూరగాయ ముక్కలను మగ్గించాలి. బఠాణీలు మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బఠాణీ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, పుల్కా, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వివిధ వంటకాల్లో వాడడంతో పాటు బఠాణీలతో ఇలా మసాలా కర్రీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.