Pesarapappu Kichdi : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెసరపప్పు ఒకటి. పెసరపప్పుతో చేసే వంటకాలు చాలారుచిగా ఉంటాయి. పెసరపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది. పెసరపప్పుతో పప్పు కూరలు, సాంబార్ వంటి వాటితో పాటు కిచిడినీ కూడా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేసే ఈ కిచిడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పుతో రుచిగా కిచిడినీ ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు కిచిడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – రెండు టీ గ్లాసులు, పెసరపప్పు – ఒక టీ గ్లాస్, నీళ్లు – 5 టీ గ్లాసులు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, తరిగిన టమాట – 1, పచ్చి బఠాణీ – పావు కప్పు, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన పచ్చిమిర్చి – 5, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, జీడిపప్పు – రెండు టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
పెసరపప్పు కిచిడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కూరగాయ ముక్కలన్నింటిని వేసి వేయించాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నానబెట్టుకున్న బియ్యంతో పాటు నీటిని కూడా వేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి కొద్దిగా చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కిచిడి తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా రైతాతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా కిచిడినీ తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో నపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.