Heat Stroke : వేసవి కాలంలో సహజంగానే మన శరీరం వేడిగా ఉంటుంది. ఇక వేడి పదార్థాలు, నూనెతో తయారు చేసిన ఆహారాలను తింటే.. శరీరంలో వేడి ఇంకా ఎక్కువవుతుంది. అలాగే బయట ఎక్కువగా తిరిగినా కూడా శరీరం వేడిగా మారుతుంది. దీంతో ఎండ దెబ్బ బారిన కూడా పడతారు. శరీరం వేడిగా మారితే మూత్రంలో మంట.. విరేచనాలు.. వంటి సమస్యలు వస్తాయి. అయితే ముందుగానే జాగ్రత్త పడితే ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను శరీరాన్ని చల్లబరుచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో వేడి సహజంగానే తగ్గుతుంది. ఇక శరీరాన్ని చల్లబరిచేందుకు పలు ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..
రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల రసం తాగాలి. ఇది శరీరాన్ని చల్లగా మారుస్తుంది. రోజంతా చల్లగా ఉంచుతుంది. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక్క గ్లాస్ చొప్పున కొబ్బరినీళ్లను తాగాలి. దీని వల్ల కూడా శరీరం చల్లగా ఉంటుంది. ఇక ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీని వల్ల కూడా శరీరంలోని వేడి తగ్గుతుంది.
రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ గసగసాల పొడిని కలిపి తాగినా కూడా శరీరం చల్లగా ఉంటుంది. దీంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తినవచ్చు. లేదా ఒక గ్లాస్ తర్బూజా జ్యూస్ తాగవచ్చు. ఇవన్నీ శరీరంలోని వేడి తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.