ఓ వైపు కరోనా సమయం.. మరోవైపు వర్షాకాలం.. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో మనం మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే సెలీనియం కూడా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.
మనకు అవసరం అయ్యే అనేక రకాల పోషకాల్లో సెలీనియం ఒకటి. దీని గురించి చాలా మందికి తెలియదు. ఇదొక మినరల్. చాలా మంది దీని పట్ల పెద్దగా శ్రద్ధ చూపించరు. కానీ ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మెటబాలిజంను నియంత్రిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. థైరాయిడ్ గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
సెలీనియం మినరల్ అయినప్పటికీ ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోజూ తగిన మోతాదులో దీన్ని తీసుకుంటే చక్కని ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్త కణాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఆ కణాలు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. శరీరంలో సెలీనియం లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. సెలీనియం తీసుకోవడం వల్ల శరీరంలో వైరస్ ఇన్‌ఫెక్షన్లు వృద్ధి చెందకుండా నివారించవచ్చు. అందువల్ల కోవిడ్ సమయంలో దీన్ని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
మనకు రోజుకు 70-80 ఎంసీజీ మోతాదులో సెలీనియం అవసరం. సెలీనియం మనకు అనేక రకాల ఆహారాల్లో లభిస్తుంది. సీఫుడ్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చేపలు, రొయ్యలతోపాటు, నట్స్, చికెన్, కోడిగుడ్లు, పాలకూర, పుట్ట గొడుగుల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే సెలీనియం లభిస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతోపాటు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365