మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు క్యాల్షియం అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. క్యాల్షియం వల్లే ఎముకలు బలంగా ఉంటాయి. ఇక మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం శోషించుకోవాలంటే అందుకు విటమిన్ డి కూడా అవసరమే. ఈ క్రమంలోనే క్యాల్షియం ఉండే ఆహారాలను తినడంతోపాటు విటమిన్ డి అందేలా చూసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలు మాత్రం క్యాల్షియం శోషణను అడ్డుకుంటాయి, దీంతో ఎముకలకు తగినంతగా క్యాల్షియం లభించక క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక మనం రోజూ తినే ఆహారాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఇక పాలకూరలో క్యాల్షియం పుష్కలంగానే ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే ఎముకలకు మంచిదే. అలా అని చెప్పి అతిగా మాత్రం తినకూడదు. తింటే పాలకూరలో ఉండే ఆగ్జలేట్స్ క్యాల్షియం శోషణను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక పాలకూరను మరీ అతిగా తినకూడదు. వారంలో 1 లేదా 2 సార్లు చాలు. అలాగే కాలిఫ్లవర్‌ను కూడా అతిగా తినకూడదు.
కాలిఫ్లవర్‌లో గాయిట్రోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కనుకనే థైరాయిడ్ సమస్య ఉన్నవారిని కాలిఫ్లవర్ లేదా క్యాబేజీ తినవద్దని చెబుతుంటారు. అయితే కాలిఫ్లవర్‌ను మరీ అతిగా తింటే మాత్రం ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే చాన్స్‌లు ఉంటాయి. కనుక కాలిఫ్లవర్‌ను కూడా అతిగా తినకూడదు. అలాగే టమాటాలు, బీట్‌రూట్‌లలోనూ ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా అతిగా తినకూడదు. తింటే ఎముకలకు క్యాల్షియం లభించక అవి పెళుసుగా మారి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. లేదంటే ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.