రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అనే సామెత అందరికీ తెలిసిందే. దీన్ని తరచూ మనం వింటూనే ఉంటాం. అయితే అది నిజమే. ఎందుకంటే.. ఆపిల్ పండ్లు మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి మన ఆకలి తీర్చడమే కాదు.. మరోవైపు మన శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. అధిక బరువు తగ్గేందుకు, గుండె ఆరోగ్యానికి ఆపిల్స్ మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్, బీటా కెరోటీన్, విటమిన్ కె తదితర పోషకాలు మన శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. ఆపిల్ పండ్లతో అనేక రకాల వంటలు చేసుకుని కూడా తినవచ్చు. ఇక ఆపిల్ పండ్ల వల్ల జీర్ణసమస్యలు పోతాయి.
నిత్యం మనం పాటించే ఆహారపు అలవాట్లు, అస్తవ్యవస్తమైన జీవనశైలి తదితర కారణాల వల్ల అనేక మందికి జీర్ణ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఇతర అనారోగ్యాలకు కూడా కారణమవుతున్నాయి. దీంతో మొత్తం మీద ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే జీర్ణ సమస్యలను పరిష్కరించుకుంటే.. దాదాపుగా ఇతర అనారోగ్యాలు కూడా రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను ఆపిల్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. నిత్యం ఆపిల్ పండ్లను తింటే వాటిలో ఉండే ఫైబర్ (పీచు పదార్థం) జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా మలబద్దకం ఏర్పడకుండా.. సాఫీగా విరేచనం అయ్యేలా చూస్తుంది.
మన శరీరంలోని జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు ఆపిల్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. దీని వల్ల మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీంతో జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఆపిల్ పండ్లను రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. భోజనానికి, భోజనానికి మధ్య స్నాక్స్ రూపంలో వీటిని తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో ఇతర కూరగాయలు, పండ్లతో కలిపి ఆపిల్స్‌ను సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
ఆపిల్ పండ్లను నిత్యం తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతోపాటు డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. వీటిలోని ఫైబర్ అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365